ఏసీబీకి పట్టుబడిన భైంసా ఎక్సైజ్ ఎస్ఐ, కానిస్టేబుల్

ఏసీబీకి పట్టుబడిన భైంసా ఎక్సైజ్ ఎస్ఐ, కానిస్టేబుల్

భైంసా, వెలుగు : తెల్లకల్లు లైసెన్స్ దారుడి నుంచి లంచం తీసుకుంటూ నిర్మల్ జిల్లా భైంసా ఎక్సైజ్ ఎస్ఐ , కానిస్టేబుల్ ఏసీబీకి పట్టుబడ్డారు. ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భైంసా మండలం కామోల్ గ్రామానికి చెందిన తెల్లకల్లు లైసెన్స్ దారుడు తన ఏరియాకు మరో లైసెన్స్ దారుడు వచ్చి అమ్మకాలు చేస్తున్నట్టు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

ఇద్దరిమధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు భైంసా ఎక్సైజ్ ఎస్ఐ పాటిల్ నిర్మల రూ.10 వేలు లంచం డిమాండ్ చేశా రు. దీంతో లైసెన్స్ దారుడు ఆదిలాబాద్ లోని ఏసీబీ అధికారులకు కంప్లయింట్ చేశాడు. మంగళవారం రాత్రి భైంసా ఎక్సైజ్ స్టేషన్ వద్ద బాధితుడి నుంచి రూ.10 వేలు మహిళా కానిస్టేబుల్ సుజాత తీసుకుని వెళ్లి ఎస్ఐ నిర్మలకు ఇచ్చింది. అప్పటికే నిఘా పెట్టిన ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ సిబ్బందితో వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పంచనామా చేసి ఎక్సైజ్ ఎస్ఐ, కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్నారు.